గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల విధులు & అధికారాలు ఏమిటి?

గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల విధులు & అధికారాలు

గ్రామ పంచాయతీ నందు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ , ప్రజలకు కావాల్సిన సౌకర్యాల కల్పనలో "వార్డు సభ్యుల" పాత్ర చాలా కీలకమైనది. వార్డు సభ్యులు గ్రామ పంచాయతీ సమావేశముల యందు , వివిధ కార్యాచరణ కమిటీలలో సభ్యులుగా  తమ బాధ్యతలను నిర్వర్తించవలసి ఉంటుంది. ఆదర్శవంతంగా విధులు నిర్వర్తించిన సభ్యులు గ్రామ పంచాయతికి చక్కని దిశను నిర్ధేశించగలుగుతారు. గ్రామాభివృద్ధికి తోడ్పాటును అందించగలుగుతారు.

1) గ్రామ పంచాయతీ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలి.

2)  సంబంధిత వార్డు మెంబర్ల గ్రామంలో సమస్యలు, ప్రజల అవసరాల గురించి పూర్తి అవగాహన కలిగియుండి వాటిని గ్రామ పంచాయతీ సమావేశాలు మరియు గ్రామసభ సమావేశాల దృష్టికి తీసుకు వచ్చి చర్చించి తగిన నిర్ణయాలు తీసుకొనుటకు చర్యలు గైకొనాలి.

3) సమావేశాల ఎజెండాలోని అంశాలను చదివి, తెలుసుకొని పూర్తీ సమాచారంతో సమావేశానికి హాజరై చర్చలో తమ అభిప్రాయాలను తెలపాలి.

4) సమావేశాలకు ఒకటి, రెండు రోజులు ముందుగానే తమ వార్డులోని ప్రజలను సమావేశపరచి తమ వార్డు సమస్యలు , ఇతర అంశాలు , ప్రత్యేకంగా చర్చించవలసిన విషయాల గురించి వార్డు ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలి.

5) సమావేశంలో  వార్డు మరియు గ్రామం మొత్తమునకు ప్రాతినిధ్యం వహించి,  చర్చలో పాల్గొని నిర్ణయాలలో భాగస్వామ్యం వహించాలి.

6) ఎజెండాలో లేని అంశాలను గురించి చర్చించరాదు. ఎజెండా లో ఏదైనా కొత్త విషయాన్ని చేర్చమని అడగరాదు.

••• పైన పేర్కొన్న విధులతో పాటు వార్డు సభ్యులకు క్రింది అధికారాలు కలవు

1) ఏ వార్డు సభ్యుడైనా గ్రామములో జరుగు పనుల యందు నిర్లక్ష్యము, వ్యర్థము లేక స్థానిక ప్రాంత అవసరములను కార్య నిర్వహణాధికారి దృష్టికి లిఖిత పూర్వకముగా తేవచ్చును. లేదా సూచన చేయవచ్చును. అట్టి సందర్భములో కార్య నిర్వహణాధికారి , సభ్యుడు తన దృష్టికి తీసుకువచ్చిన విషయము గురించి తాను తీసుకున్న లేదా తీసుకొనబోవు చర్యల గురించి తదుపరి సమావేశము నందు విశదీకరించవలసి ఉండును.

2) నియమముల ననుసరించి ప్రతీ సభ్యునికి , గ్రామ పంచాయతీ పరిపాలనకు సంబంధించిన విషయములపై తీర్మాణము ప్రవేశ పెట్టుటకు , సర్పంచ్ ను ప్రశ్నించుటకు అధికారము కలదు.

3) కార్య నిర్వహణాధికారికి తగు నోటీసు ఇచ్చిన పిమ్మట గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించుటకు అధికారము కలదు.

4) పంచాయతీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల అమలును పర్యవేక్షించవచ్చు. పనుల నాణ్యత , సత్వర పూర్తికి సూచనలు ,సలహాలు ఇవ్వడంలో చొరవ చూపవచ్చు.

5) గ్రామ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థన సమావేశాన్ని కోరవచ్చు.

6) ప్రస్తుతం వున్న ఉప సర్పంచ్ ప్రవర్తన సరిగా లేదని భావించినా , గ్రామ ప్రయోజనాలకు భంగకరమని భావించినా , ఉప సర్పంచ్ మార్పును కోరుతూ నిబంధనల మేరకు అవిశ్వాస తీర్మాణం ప్రవేశ పెట్టవచ్చు. అయితే ఉప సర్పంచు పదవి స్వీకరించిన 4 సంవత్సరాల తర్వాత మాత్రమే ఇది సాధ్య పడుతుంది. 

7) గ్రామ పంచాయతీ ఆదాయ, వ్యయాలను మదింపు చేసి ఉన్న వనరులతో ఏయే అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టవచ్చనే కీలక నిర్ణయాలను బడ్జెట్ సమావేశాలలో తీసుకొంటారు. ఆ నిర్ణయాలు గ్రామాభివృద్ధిని ప్రభావితం చేస్తాయి.  నిర్ణయాలు తీసుకునే ప్రజా ప్రతినిధులుగా వార్డు సభ్యులు కీలక పాత్ర వహిస్తారు. 

8) గ్రామాభివృద్ధికై ఏర్పాటు చేయబడిన కార్యాచరణ కమిటీలు ,అభివృద్ధి కమిటీలలో సభ్యులుగా  వార్డు సభ్యులు ఉంటారు. ఆయా కమిటీల యందు సభ్యులుగా ముఖ్య పాత్ర వహించాల్సి వుంటుంది.  ( జి.వో. నం.289, తే.01-08-1997 మరియు సెక్షను 40)

సేకరణ : నాయకుల రాజేష్

సిరిగేదొడ్డి గ్రామ పంచాయతీ, గుమ్మఘట్ట మండలం, అనంతపురం జిల్లా, ఫోన్ నంబర్ : 9346314349.



Comments

Post a Comment

Popular posts from this blog

స్మృతుల్లో స్థిరంగా నిలిచిపోయే సేవలకు – ఇదే మా ఆత్మీయ వీడ్కోలు సభ

ప్రశ్న (జ్యోతిష్య శాస్త్రము)

శివాలయ సన్నిధిలో- కర్మగాథ